10 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌.. హైదరాబాద్‌లో.. ఎప్పుడంటే ?

24 Dec, 2021 13:19 IST|Sakshi

విభిన్న సంస్కృతులకు వేదికైన హైదరాబాద్‌ నగరం వేగంగా మెట్రోపాలిటన్‌ సిటీగా ఎదిగింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో అవకాశాలను వేగంగా అందిపుచ్చుకుని అనతి కాలంలోనే దేశంలో పెద్ద నగరాల సరసన నిలిచింది. ఐటీ విషయంలో ఇప్పటికే చెన్నై, కోల్‌కతాలను వెనక్కి నెట్టిన హైదరాబాద్‌ తాజాగా ముంబైని వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది. 

అగ్రస్థానం సిలికాన్‌ సిటీదే
ప్రస్తుతం దేశంలో కమర్షియల్‌ స్పేస్‌ లభ్యత విషయంలో బెంగళూరు నగరం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సిలికాన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం అనేక స్టార్టప్‌ కంపెనీలు, ఐటీ కంపెనీలకు వేదికగా ఉంది. దీంతో ఇక్కడ కమర్షియల్‌ స్పేస్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది. రియల్టీ ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం 16 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది. 

రేసులో ఎన్‌సీఆర్‌
వందళ ఏళ్లుగా దేశ రాజధానిగా ఉన్న హస్తినలో పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌ జరిగినంత వేగంగా ఐటీ, ఇతర ఇండస్ట్రీలు పుంజుకోలేదు. కానీ ఢిల్లీ నగర శివార్లలో వెలిసిన గురుగ్రామ్‌, నోయిడాలతో ఢిల్లీ నగర రూపు రేఖలు మారిపోయాయి. నేషనల​్‌ క్యాపిటల్‌ రీజియన్‌లోకి వచ్చే ఈ మూడు నగరాలు ఐటీతో పాటు అనేక పరిశ్రమలకు నెలవుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ అతి తక్కువ కాలంలోనే కమర్షియల్‌ స్పేస్‌కి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 11 కోట​​​​​‍్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది.

ముంబై వెంటే భాగ్యనగరం
దేశ వాణిజ్య రాజధాని ముంబై ఐటీ పరిశ్రమను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. దీంతో ఆ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా పూనెకు తరలిపోయాయి. ఐనప్పటికీ ఈ వాణిజ్య రాజధానిలో కమర్షియల్‌ స్పేస్‌కి డిమాండ్‌ ఎంత మాత్రం తగ్గలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ముంబై నగరంలో 10.50 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ మార్కు చేరుకునేందుకు దక్షిణాది నగరమైన హైదరాబాద్‌ రివ్వున దూసుకొస్తోంది.

హైదరాబాద్‌, ఢిల్లీలదే
రియల్టీ వర్గాల గణాంకాల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 7.6 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా మరో 4 కోట్ల చదరపు అడుగుల స్థలం 2023 కల్లా అందుబాటులోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది కల్లా హైదరాబాద్‌ నగరం కమర్షియల్‌ స్పేస్‌లో ముంబైని దాటనుంది. మరోవైపు ఢిల్లీని మినహాయిస్తే ముంబై, బెంగళూరులలో కమర్షియల్‌ స్పేస్‌ మార్కెట్‌ శాచురేషన్‌కి చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోనాలుగైదేళ్ల పాటు ఢిల్లీ, హైదరాబాద్‌లలోనే కమర్షియల్‌ ‍ స్పేస్‌ జోష్‌ కనిపించనుంది. 

చదవండి: ఏడు ప్రధాన నగరాల్లో బిగ్‌ రియాల్టీ డీల్స్‌ ఇవే

మరిన్ని వార్తలు