భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే

1 Oct, 2021 16:05 IST|Sakshi

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ సంస్థలు ప్రకటించిన దేశంలోని టాప్‌ 100 ధనవంతుల జాబితాలో ముగ్గురు హైదరాబాదీలు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు గతేడాదితో పోల్చితే హైదరాబాద్‌లో ధనవంతుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా ఈ నివేదిక వెల్లడించింది.  

ఫార్మా కంపెనీ వారే..
బల్క్‌ డ్రగ్స్‌ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా హబ్‌గా పేరు తెచ్చుకుంది హైదరాబాద్‌. ఈ పేరుకు తగ్గట్టే ఐఐఎఫ్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా రిచ్‌ టాప్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతుల్లో ముగ్గురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం గమనార్హం. దివీస్‌ మురళీ, హెరిటో గ్రూప్‌ పార్థసారథిరెడ్డి, ఆరబిందో ఫార్మా పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డిలు హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ టాప్‌ 100లో ఉన్నారు. 

దివీస్‌ మురళీ ఆస్తులు
ఐఐఎఫ్‌ఎల్‌, హురున్‌ ఇండియా 2021 ఏడాదికి గాను ప్రకటించిన వంద మంది ఐశ్వర్యవంతుల జాబితాలో దివీస్‌ ల్యాబ్స్‌ యజమాని దివి మురళి 14వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 79,000 కోట్లుగా హురున్‌ జాబితా తెలిపింది. గతేడాదికి సంబంధించిన జాబితాలో ఆయన రూ. 49,200 కోట్ల రూపాయలతో 17వ స్థానంలో నిలవగా, ఈసారి మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.. ఏడాది కాలంలో ఆయన ఆస్తులు 61 శాతం పెరిగాయి. దీంతో మూడు స్థానాలు పైకి చేరుకున్నారు.

హెటిరో, అరబిందో
గతేడాది హురున్‌ ప్రకటించిన టాప్‌ 100 జాబితాలో రూ, 13,900 కోట్ల రూపాయల ఆస్తులతో హెటిరో సంస్థ ప్రమోటర్‌ పార్థసారథిరెడ్డి 88వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన ఆస్తుల విలువ రూ. 26,100 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో టాప్‌ 100 లిస్టులో ఆయన 23 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానంలో నిలిచారు. ఇక అరబిందో గ్రూపు ప్రమోటర్‌ పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి రూ. 19,000 కోట్ల ఆస్తులతో 86వ స్థానంలో నిలిచారు. 

వెయ్యి కోట్లకు పైన
ఫార్మా, ఐటీ తదితర పరిశ్రమలతో విరాజిల్లుతున్న హైదరాబాద్‌ నగరంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. మానవ వనరులు, మౌలిక సదుపాయలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారు హైదరాబాద్‌లో 1007 మంది ఉన్నట్టు హురున్‌ వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ఐశ్వర్యవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

వీళ్లు కూడా
లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్‌ సీ సత్యనారాయణ ఆస్తులు రూ. 8400 కోట్లు, సువెన్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రమోటర్‌ జాస్తి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ ఆస్తులు రూ. 9,700 కోట్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి జీఏఆర్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ జీ అమరేందర్‌రెడ్డి ఆస్తుల విలువ రూ. 12,000 కోట్లు ఉన్నట్టు హురున్‌ ప్రకటించింది. 

చదవండి : అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!

మరిన్ని వార్తలు