హ్యుందాయ్‌ చేతికి జీఎం ప్లాంట్‌.. కొత్త వ్యూహాలు సిద్ధం!

14 Mar, 2023 03:31 IST|Sakshi

ఇరు సంస్థల మధ్య ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న జనరల్‌ మోటార్స్‌ (జీఎం) ఇండియాకు చెందిన తాలేగావ్‌ ప్లాంటును కొనుగోలు చేయనుంది. డీల్‌ పూర్తయితే స్థలం, భవనాలు, యంత్రాలు హ్యుందాయ్‌ పరం కానున్నాయి. ఇందుకోసం జీఎం ఇండియాతో టెర్మ్‌ షీట్‌ ఒప్పందం చేసుకున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ సోమవారం ప్రకటించింది. అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు.

ప్లాంటు చేతికి వచ్చిన తర్వాత తొలుత వెన్యూ ఎస్‌యూవీని ఈ కేంద్రంలో తయారు చేసి ఎగుమతి చేయాలన్నది హ్యుందాయ్‌ ఆలోచన. 2028 నాటికి భారత్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్‌ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 6 ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరు వద్ద ఉన్న హ్యుందాయ్‌ ప్లాంటు దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. భారత్‌తోపాటు విదేశాల నుంచి కంపెనీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో అదనపు తయారీ సామర్థ్యం ఇప్పుడు సంస్థకు తప్పనిసరి.

మరిన్ని వార్తలు