టిక్‌టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!

16 Feb, 2023 14:40 IST|Sakshi

వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్‌తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్‌టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్‌తో కారు ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. 

హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు.

దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్‌తో వస్తున్నాయి.

మరిన్ని వార్తలు