భారత మార్కెట్లలోకి హ్యూందాయ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం..! లాంచ్‌ ఎప్పుడంటే..!

28 Jul, 2021 15:14 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా పలు మల్టీనేషనల్‌ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి నడుం బిగించాయి. పలు కంపెనీలు భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి కోసం పలు కంపెనీల చర్యలు ఊపందుకున్నాయి. కంపెనీల విధానాలు, మౌలిక సదుపాయాల కల్పించడంలో, ప్రభుత్వాల నుంచి  ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు సానుకూల పవనాలు వీస్తుండడంతో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉత్పత్తికి వేగం పుంజుకోనుంది.

తాజాగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేసేందుకు హ్యుందాయ్ అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను  లాంచ్ చేయడానికి కంపెనీ యోచిస్తోంది. 2024 నాటికి అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను  ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "క్లీనర్ మొబిలిటీ వైపు కంపెనీ అడుగులు ప్రారంభమైనాయి. హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో ఇప్పటికే కోనా ఈ.వీ. వాహనాన్ని ప్రకటించాము. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్‌ మార్కెట్‌కు సరిపోయే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తీసుకువస్తామ’’ని పేర్కొన్నారు. కోనా ఈవీ 2021 ఆగస్టు 10 న లాంచ్‌ చేయనున్నట్లు  తెలుస్తోంది. 

హ్యూందాయ్‌ భారత మార్కెట్లలో రిలీజ్‌ చేయనున్న కొత్త ఈవీ కాంపాక్ట్‌ ఎస్‌యూవీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ కార్‌ రేంజ్‌ను , బ్యాటరీ సామర్థ్యాన్ని ఇంకా ఖరారు చేయలేదు. హ్యూందాయ్‌ తీసుకువస్తోన్న కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఏఎక్స్‌1 మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ తరహాలో అభివృద్ది చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఈవీ ఎస్‌యూవీ ధర సుమారు రూ. 15 లక్షల వరకు ఉండొచ్చునని తెలుస్తోంది.  అంతేకాకుండా టాటా నెక్సాన్‌ ఈవీ, ఎమ్‌జీ హెక్టార్‌ ఈవీ తో పోటీ పడనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు