హ్యుందాయ్‌ సంచలనం! త్వరలో హైడ్రోజన్‌ వేవ్‌ కారు!!

28 Aug, 2021 20:59 IST|Sakshi

కొరియర్‌ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్లైయింగ్‌ కార్‌ టెక్నాలజీపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది. హైడ్రోజన్‌తో నడిచే కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
ఈవీలకు ధీటుగా
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) కార్ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇండియా మొదలు అమెరికా వరకు మారుతి నుంచి జనరల్‌ మెటార్స్‌ వరకు అన్ని కంపెనీలు ఈవీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇక టెస్లా కంపెనీ ఎస్‌ ప్లెయిడ్‌ కార్లయితే కొత్త ట్రెండ్‌నే క్రియేట్‌ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈవీ కార్లకే పరిమితం అవుతామంటూ ఆడి ప్రకటించింది. ఇలా ఆటో మొబైల్‌ ఇండస్ట్రీ అంతా ఈవీ కార్ల గురించి, దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి బిజీగా ఉంటే హ్యుందాయ్‌ వీటికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటోంది. ఈవీ కార్లకు తోడు హైడ్రోజన్‌ కార్ల తయారీపై ఫోకస్‌ పెట్టింది.

హైడ్రోజన్‌ వేవ్‌
సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించుకునే వాటిలో బ్యాటరీల తర్వాత స్థానం హైడ్రోజన్‌ సెల్స్‌దే. అయితే బ్యాటరీ ఆధారిత ఈవీలతో పోల్చితే హైడ్రోజన్‌ సెల్స్‌ ఆధారిత ఇంజన్ల పనితీరు సంక్లిష్టమైంది. ఆ టెక్నాలజీ ఇంకా కమర్షియల్‌గా విరివిగా వినియోగంలోకి రాలేదు. కానీ హ్యందాయ్‌ ఓ అడుగు ముందుకు వేసి హ్రైడోజన్‌ వేవ్‌ పేరుతో కాన్సెప్టు కారుని సిద్ధం చేసింది.

సెప్టెంబరు 7న
హైడ్రోజన్‌ సెల్‌ బేస్డ్‌ కాన్సెప్టు కారుకు సంబంధించిన విశేషాలు సెప్టెంబరు 7న జరిగే వర్చువల్‌ సమావేశంలో హ్యందాయ్‌ సంస్థ వెల్లడించనుంది. ఆ తర్వాత కొరియాలోని గొయాంగ్‌లో ఈ కారుకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించనుంది. ఈ మేరకు హ్యుందాయ్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. హైడ్రోజన్‌ కారుకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే సెప్టెంబరు 7 వరకు వేచి చూడాలి. 

చదవండి : ఏసీ ఎకానమీ కోచ్‌.. ధర తక్కువ సౌకర్యాలు ఎక్కువ

మరిన్ని వార్తలు