ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..

5 Oct, 2023 04:32 IST|Sakshi

26 స్పాన్సర్లు, 500 పైగా అడ్వర్టైజర్లు

లిస్టులో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా

డిస్నీ స్టార్‌ వెల్లడి

న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్‌ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ విభాగం హెడ్‌ సంజోగ్‌ గుప్తా తెలిపారు. వీటిలో చాలా  స్పాన్సర్లు టీవీ, డిజిటల్‌ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్‌ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు.

ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్‌ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది.  

భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్‌ దన్ను
ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్‌ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్‌ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్‌లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు.

స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్‌ మహీంద్రా, డ్రీమ్‌11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, పెర్నాడ్‌ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్‌ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్‌ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్‌ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్‌ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్‌ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్‌ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్‌ చేస్తున్నాయి.

అనువైన ప్యాకేజీలు..
ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్‌ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు  ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్‌ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్‌ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ‘‘సెల్ఫ్‌–సర్వ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్‌ టీమ్స్‌ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్‌ చేసుకునే వీలుంటుందని వివరించారు.
 

మరిన్ని వార్తలు