ఐసీఐసీఐ బ్యాంక్‌ హౌసింగ్‌ లోన్స్‌ రికార్డ్

11 Nov, 2020 14:58 IST|Sakshi

రూ. 2 ట్రిలియన్లకు మార్జిగేజ్‌ రుణాలు

ఈ ఫీట్‌ సాధించిన తొలి ప్రయివేట్‌ బ్యాంక్‌

2016లో తొలిసారి రూ. ట్రిలియన్‌ మార్క్‌కు

మరో నాలుగేళ్లలో రూ. 3 ట్రిలియన్లకు పోర్ట్‌ఫోలియో!

ముంబై: మార్టిగేజ్‌ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 2 లక్షల కోట్లను అధిగమించినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. దేశీయంగా ఈ ఫీట్‌ను సాధించిన తొలి ప్రయివేట్‌ రంగ సంస్థగా నిలిచినట్లు తెలియజేసింది. హౌసింగ్‌ రుణాలలో బ్యాంక్‌ తొలిసారి 2016లో రూ. ట్రిలియన్‌ మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రికార్డ్‌స్థాయిలో మార్టిగేజ్‌ రుణాలను మంజూరు చేసినట్లు తెలియజేసింది. వెరసి కోవిడ్‌-19కు ముందు స్థాయిని సైతం అధిగమించినట్లు వివరించింది. ఇదే విధంగా అక్టోబర్‌లోనూ రికార్డును నెలకొల్పుతూ అత్యధిక రుణాలను విడుదల చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రానున్న నాలుగేళ్లలోగా రూ. 3 ట్రిలియన్‌ మార్టిగేజ్‌ లోన్‌ మార్క్‌ను అందుకోనున్నట్లు అంచనా వేసింది. 

కారణాలివీ..
రుణాల ప్రాసెసింగ్‌లో డిజిటైజేషన్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ వినియోగంతో క్లయింట్లకు రుణాలు ఆఫర్‌ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలో వృద్ధిని సాధించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది. దాదాపు మూడో వంతు రుణాలను డిజిటలైజేషన్‌ ద్వారానే విడుదల చేసినట్లు తెలియజేసింది. ప్రధానంగా చౌక వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని రాష్ట్రాలలో తగ్గిన స్టాంప్‌ డ్యూటీ వంటి అంశాలు రుణాలకు డిమాండ్‌ పెంచినట్లు వివరించింది. దీనికితోడు వేగవంతమైన వృద్ధికి వీలున్న ద్వితీయ శ్రేణి పట్టణాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది.  

షేరు ఫ్లాట్‌..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490ను అధిగమించిన షేరు రూ. 472 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది.

మరిన్ని వార్తలు