సీనియర్‌ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!

20 Feb, 2022 17:21 IST|Sakshi

ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. "గోల్డెన్ ఇయర్స్" అనే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో వృద్దులు పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. ఈ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ గడువు తేదీని 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ పథకం కింద బ్యాంకు వృద్ధులకు సంవత్సరానికి వడ్డీని 0.50 శాతం అదనంగా అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. 

ఈ వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నాటి నుంచి అమల్లోకి వచ్చాయి.డిపాజిట్ మొత్తం రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఇతర టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు, నియమ నిబంధనలు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు, అదే కాలానికి గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ కింద సీనియర్ సిటిజన్లు 6.35 శాతం వడ్డీ రేటును లభిస్తుంది. సాధారణ ప్రజలకు వార్షికంగా లభిస్తున్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం అదనం. 

గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డి స్కీమ్‌లో ఉన్న డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేసినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్‌లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్‌డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ ఎస్‌బీఐ వీకేర్ గడువును పొడిగించింది. బ్యాంక్ ఎస్‌బీఐ వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది.

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!)

>
మరిన్ని వార్తలు