ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం హైజంప్‌!

25 Apr, 2022 14:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 7,719 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,886 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక స్టాండెలోన్‌ నికర లాభం 59 శాతం ఎగసి రూ. 7,019 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 23,953 కోట్ల నుంచి రూ. 27,412 కోట్ల కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 44 శాతం వృద్ధితో రూ. 23,339 కోట్ల నికర లాభం సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్‌) 19.16 శాతంగా నమోదైంది. 

వడ్డీ ఆదాయం అప్‌ 
తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పుంజుకుని రూ. 12,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.84 శాతం నుంచి 4 శాతానికి బలపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.96 శాతం నుంచి 3.6 శాతానికి దిగిరాగా, నికర ఎన్‌పీఏలు సైతం 1.14 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గాయి. రికవరీలు, అప్‌గ్రేడ్స్‌ రూ. 493 కోట్లు అధికమై రూ. 4,693 కోట్లను తాకాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 2,883 కోట్ల నుంచి సగానికిపైగా తగ్గి రూ. 1,069 కోట్లకు పరిమితమయ్యాయి. బ్యాంక్‌ హోల్‌సేల్‌ రుణాల చీఫ్‌ విశాఖ మూల్యే పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుత రిటైల్‌ బిజినెస్‌ హెడ్‌ అనుప్‌ బాగ్చీకి బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఈ బాటలో బాగ్చీ బాధ్యతలను ప్రస్తుత సీఎఫ్‌వో రాకేష్‌ ఝా చేపట్టనున్నట్లు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు