ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం 19% అప్‌

24 Jan, 2022 04:39 IST|Sakshi

క్యూ3లో రూ. 6,536 కోట్లు  

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం దాదాపు 19 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 6,536 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ), గణనీయంగా పెరగడం, ప్రొవిజనింగ్‌ తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్‌ నికర లాభం రూ. 5,498 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 40,419 కోట్ల నుంచి రూ. 39,866 కోట్లకు తగ్గింది. ‘‘అన్ని విభాగాల్లోనూ వృద్ధి నమోదు చేశాం.

నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 23 శాతం, ప్రధానమైన ఆపరేటింగ్‌ లాభం 25 శాతం మేర పెరిగాయి. ప్రొవిజన్లు 27 శాతం తగ్గాయి’’ అని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సందీప్‌ బాత్రా తెలిపారు. క్యూ3లో ఎన్‌ఐఐ రూ. 9,912 కోట్ల నుంచి రూ. 12, 236 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.67 శాతం నుంచి  3.96 శాతానికి చేరింది. స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) నిష్పత్తి 4.38 శాతం నుంచి 4.13 శాతానికి దిగి వచ్చింది. నికర ఎన్‌పీఏలు 0.63 శాతం నుంచి 0.85 శాతానికి చేరాయి.  మరోవైపు, స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 25 శాతం పెరిగి రూ. 4,940 కోట్ల నుంచి రూ. 6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 24,416 కోట్ల నుంచి రూ. 28,070 కోట్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు