అంచనాలకు మించి అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..!

24 Apr, 2022 11:25 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నికర లాభాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఆర్జించింది. సుమారు రూ. 7,018.7 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు గడించింది. అంతకుమందు ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు రూ. 4403 కోట్లు. నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగి రూ. 12,605 కోట్ల రూపాయలుగా నమోదైంది. 

తగ్గిన ఎన్‌పీఏ ఆస్తుల విలువ..!
నిరర్థక ఆస్తులు(నాన్‌ పర్‌ఫర్మింగ్‌ ఆసెట్స్‌(ఎన్‌పీఏ)) విలువ స్వల్పంగా క్షీణించింది. 53 బేసిస్ పాయింట్లు అంటే 3.6 శాతం మేర తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ సైతం తగ్గింది. 0.76 శాతంతో తొమ్మిది బేసిస్ పాయింట్ల మేర క్షీణత కనిపించింది. నాలుగో త్రైమాసికంలో గ్రాస్ ఎన్పీఏ 4,204 కోట్ల రూపాయలుగా రికార్డయింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ మొత్తం 4,018 కోట్ల రూపాయలు. బ్యాంక్ అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 17 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. 

గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన రుణాలను మినహాయించి- రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు 14 శాతం మేర పెరిగాయి. వీటి విలువ 10.64 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం టర్మ్ డిపాజిట్లల్లో తొమ్మిది శాతం మేర పెరుగుదల నమోదైంది.గత ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ మంచి పురోగతిని రికార్డు చేసింది. అంతేకాకుండా షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేర్‌పై అయిదు రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. 

చదవండి: నెగ్గిన అమెజాన్‌ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్‌..!

మరిన్ని వార్తలు