రిస్క్‌ తక్కువ.. రాబడి ఎక్కువ! 

20 Jun, 2022 10:20 IST|Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈ‍క్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌ రివ్యూ

ఎక్కువ రిస్క్‌ వద్దు.. పెట్టుబడిపై రాబడి మెరుగ్గా ఉండాలి? ఈ రెండూ కోరుకునే వారికి హైబ్రిడ్‌ ఫండ్స్‌ అనుకూలం. ఇవి ఈక్విటీ,  డెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. వీటితో పోలిస్తే నూరు శాతం తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్‌ తగ్గించుకునేందుకు కొంత మొత్తాన్ని డెట్‌కు కేటాయించే హైబ్రిడ్‌ పథకాలు అందరికీ అనుకూలమే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌.. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ విభాగం కిందకే వస్తుంది. ఈ పథకం ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది. మధ్య కాలం నుంచి (5 ఏళ్లు) దీర్ఘకాలానికి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.  

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈ‍క్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌ రివ్యూ
రాబడులు  
ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 12% రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడి రేటు 15.56 శాతంగా ఉంటే, ఐదేళ్లలో 12.28 శాతం, ఏడేళ్లలో 13 శాతం, 10 ఏళ్ల కాలంలో 16 శాతం చొప్పున రాబడులను అందించింది. కొంత భాగాన్ని డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది కనుక ఈ పథకం చూపిస్తున్న పనితీరు మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. ఏ కాలంలో చూసినా రాబడి 12 శాతం తగ్గలేదు. పైగా ఈ పథకం  1999లో ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే పెట్టుబడులపై ఏటా 14 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చింది. మెరుగైన పనితీరుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కానీ, బ్యాలన్స్‌డ్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్స్‌ ఫండ్స్‌ విభాగాలు గడిచిన ఏడాది కాలంలో సగటున నష్టాల్లో ఉండడం గమనించాలి. వీటితో పోలిస్తే ఐసీఐసీఐ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్‌ పనితీరు అందనంత ఎత్తులో ఉంది. మిగిలిన కాలాల్లోనూ ఈ పథకమే 2–5 శాతం మేర అధికంగా ప్రతిఫలాన్నిచ్చింది. కనుక రాబడుల పరంగా స్థిరమైన, నమ్మకమైన పనితీరు ఈ పథకానికి ఉంది. 

పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌లో 35 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.19,096 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 71.3 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. 28.5 శాతం డెట్‌ విభాగానికి కేటాయించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 57 స్టాక్స్‌ ఉన్నాయి. టాప్‌–10 స్టాక్స్‌లోనే 52 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. డెట్‌లో కొంచెం రిస్క్‌ ఎక్కువ ఉండే ఏఏ రేటెడ్‌ సాధనాల్లో సుమారు 7 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మిగతా పెట్టుబడులన్నీ అధిక రక్షణ కలిగిన ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్‌ సాధనాల్లోనే పెట్టింది. ఈక్విటీల్లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీలకు మొత్తం పెట్టుబడుల్లో 17.55 శాతం కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13.70 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 9.39 శాతం, నిర్మాణ రంగ కంపెనీల్లో 7.73 శాతం, ఆటోమొబైల్‌ కంపెనీల్లో 5.63 శాతం, మైనింగ్‌ కంపెనీల్లో 5 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది.

మరిన్ని వార్తలు