ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభం డౌన్‌

22 Jul, 2022 11:32 IST|Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో బ్రోకరేజీ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 273 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 795 కోట్లకు చేరింది. 

సంస్థాగత ఈక్విటీల విభాగం ఆదాయం 17 శాతం నీరసించి రూ. 49 కోట్లకు చేరింది. మార్కెట్లో పరిమాణం మందగించడం, క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలు క్షీణించడం ప్రభావం చూపింది. కాగా.. పంపిణీ బిజినెస్‌ ఊపందుకుంది. 28 శాతం జంప్‌చేసి రూ.152 కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ తదితర ప్రొడక్టులు ఇందుకు సహకరించాయి. మార్జిన్‌ ఫండింగ్‌ ద్వారా రూ. 619 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. 

గతేడాది క్యూ1తో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపుకాగా.. 80 లక్షల మంది క్లయింట్‌ బేస్‌ను కలిగి ఉంది. క్యూ1లో కొత్తగా 4.4 లక్షల మంది జత కలిశారు. ఇదే కాలంలో ఇతర బ్రోకింగ్‌ సంస్థలు జిరోధా 62 లక్షలు, అప్‌స్టాక్స్‌ 52 లక్షలు, గ్రో 38 లక్షలు, ఏంజెల్‌ వన్‌ 36 లక్షల చొప్పున క్లయింట్లను గెలుచుకోవడం గమనార్హం! 
ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.3 శాతం బలపడి రూ. 469 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు