బ్రిటీష్‌ వారి లీ కూపర్‌ బ్రాండ్‌.. ఇప్పుడీ భారతీయ కంపెనీ సొంతం..

28 Oct, 2021 08:15 IST|Sakshi

ఐకానిక్స్‌ లైఫ్‌స్టైల్‌ చేతికి లీ కూపర్‌ హక్కులు 

Iconix Lifestyle India: బ్రిటిష్‌ బ్రాండ్‌ లీ కూపర్‌ మేధోసంపత్తి హక్కులను భారత్‌లో ఐకానిక్స్‌ లైఫ్‌స్టైల్‌ ఇండియా దక్కించుకుంది. లీ కూపర్‌ ఉత్పత్తుల పంపిణీని విస్తృతం చేయడంతోపాటు బ్రాండ్‌ స్థానాన్ని మరింత పదిలపరిచేందుకు ఐకానిక్స్‌కు ఈ డీల్‌ దోహదం చేయనుంది. రిలయన్స్, ఐకానిక్స్‌ బ్రాండ్‌ సంయుక్తంగా ఐకానిక్స్‌ లైఫ్‌స్టైల్‌ను ప్రమోట్‌ చేస్తున్నాయి. 

1908 నుంచి
స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్‌ కంపెనీగా లీ కూపర్‌ బ్రాండ్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన డెనిమ్‌ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. 126 దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. లేడీస్‌, జంట్స్‌, చిల్ట్రన్‌ ఇలా అన్ని కేటగిరిల్లో తమ ఉత్పత్తులను లీ కూపర్‌ అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ కంపెనీకి చెందిన మేథో హక్కులను ముఖేశ్‌ అంబానీ ఆధీనంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్‌ బ్రాండ్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌) సొంతం చేసుకుంది. దీంతో లీ కూపర్‌ బ్రాండ్‌ మరింతగా భారతీయులకు చేరువ కానుంది.

గతంలో
గతంలో టాటా గ్రూపు ల్యాండ్‌రోవర్‌, జాగ్వార్‌ వంటి విదేశీ కంపెనీనలు చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. తాజాగా రిలయన్స్‌ సంస్థ సైతం అంతర్జాతీయ బ్రాండ్లను సొంతం చేసుకునే పనిలో ఉంది.

మరిన్ని వార్తలు