బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ ‘పాజిటివ్‌’

20 Dec, 2022 10:38 IST|Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ రంగం అవుట్‌లుక్‌ను దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా సోమవారం ‘పాజిటివ్‌’కు అప్‌గ్రేడ్‌ చేసింది. రుణ నాణ్యత పెరుగుదల, మూలధన పటిష్టతలు తన అవుట్‌లుక్‌ పెంపునకు కారణమని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్‌–2024 మార్చి)  చివరికల్లా స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) ఈ దశాబ్ద కనిష్ట స్థాయి.. 4 శాతానికి దిగివస్తాయని విశ్వసిస్తున్నట్లు ఇక్రా పేర్కొంది.

ప్రస్తుత 2022–23లో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 15.2 శాతం ఉంటే, 2023–24 నాటికి ఈ రేటు 11 నుంచి 11.6 శాతానికి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వ రంగం బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణవృద్ధి 13.4–14.1 శాతం శ్రేణిలో ఉంటే, 2022–23లో ఈ రేటు 9.5–10.1 శాతం శ్రేణికి దిగివస్తుందని ఇక్రా అంచనావేసింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ విషయంలో ఈ రేటు 14.5–15.5 శాతం శ్రేణి నుంచి 12.6–13.5 శాతం శ్రేణికి దిగివస్తుందని విశ్లేíÙంచింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణంగా పేర్కొంది.

 2023–24 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ 1 శాతం లోపునకు దిగివస్తుందని అంచనావేసింది. బ్యాంకింగ్‌ నికర వడ్డీ మార్జిన్లు 2023–24లో భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి డిపాజిట్‌ రేటు భారీ పెంపు అవకాశాలను కారణంగా చూపింది. అయితే అధిక రుణ విలువలు బ్యాంకింగ్‌ పటిష్టతకు దోహదపడుతుందని విశ్లేషించింది. చక్కటి లాభదాయకత ద్వారా బ్యాంకింగ్‌ స్వయంగా మూలధన అవసరాలను తీర్చుకోగలుగుతాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

మరిన్ని వార్తలు