ఐడీబీఐ బ్యాంక్‌ కొనుగోలుకి బిడ్స్‌

9 Jan, 2023 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ప్రాథమిక) బిడ్స్‌ దాఖలయ్యాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయానికి పలు కంపెనీలు ఆసక్తిని చూపినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో అటు ప్రభుత్వం, ఇటు ఎల్‌ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటాను విక్రయించనున్నాయి. ఇందుకు అక్టోబర్‌లోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికాయి.

వీటికి ఈ నెల 7న గడువు ముగిసింది. తొలి దశ ముగియడంతో రెండో దశలో భాగంగా బిడ్డర్లు సాధ్యా సాధ్యాలను పరిశీలించాక ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. విజయ వంతమైన బిడ్డర్‌ సాధారణ వాటాదారుల  నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. కాగా.. కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండటంతోపాటు.. ఐదేళ్లలో మూడేళ్లు లాభాలు ఆర్జించి ఉంటేనే బ్యాంకులో వాటా కొనుగోలుకి బిడ్‌ చేసేందుకు అర్హత ఉంటుందటూ గతంలోనే దీపమ్‌ తెలియజేసింది.

చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్‌!

మరిన్ని వార్తలు