ఐడీబీఐ బ్యాంక్‌ లాభం రూ. 603 కోట్లు

29 Jul, 2021 01:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ నిర్వహణలోని ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ ఈ ఏడాది(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో స్టాండెలోన్‌ నికర లాభం నాలుగు రెట్లుపైగా దూసుకెళ్లి రూ. 603 కోట్లను అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 144 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,901 కోట్ల నుంచి రూ. 6,555 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం వృద్ధితో రూ. 2,506 కోట్లను తాకింది.

స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 26.81 శాతం నుంచి 22.71 శాతానికి బలహీనపడ్డాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.55 శాతం నుంచి 1.67 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 1,752 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 1.25 శాతం మెరుగుపడి 4.06 శాతాన్ని తాకాయి. రూ. 863 కోట్లమేర కోవిడ్‌–19 సంబంధ ప్రొవిజన్లు చేపట్టింది. కాగా.. క్యూ1లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 159 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు జంప్‌చేసింది.  
ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు 1.2% క్షీణించి రూ. 37.6 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు