ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం!

17 Mar, 2023 18:11 IST|Sakshi

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) విభాగం అధికారిక ప్రకటన చేసింది. 

ఐడీఐబీ బ్యాంక్‌ను వ్యూహాత్మక అమ్మక ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ( Expression of Interest (EOI)దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై దీపం సెక్రటరీ తుహిన్‌కాంత పాండే ట్వీట్‌లు చేశారు. ఐడీబీఐ బ్యాంక్‌ కొనుగోలు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈఏఐలు దాఖలయ్యాయని, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం కేంద్రం, ఆర్‌బీఐ ఐడీబీఐ కొనుగోలు చేసేందుకు దాఖలైన బిడ్లను పరిశీలిస్తుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి భద్రతాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే రెండో దశ బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. 

ఐడీబీఐలో కేంద్రం,ఎల్‌ఐసీ వాటా ఎంతంటే
కేంద్రం, ఎల్‌ఐసీ ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. విక్రయంలో భాగంగా ఎల్‌ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్‌ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్‌ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి.

మరిన్ని వార్తలు