ఐడీబీఐ ‍బ్యాంక్‌ లాభం జూమ్‌

24 Jan, 2023 20:14 IST|Sakshi

ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 927 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 578 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 23 శాతం ఎగసి రూ. 2,925 కోట్లను తాకింది.

గత క్యూ3లో రూ. 2,383 కోట్ల ఎన్‌ఐఐ నమోదైంది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 21.68 శాతం నుంచి 13.82 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 1.81 శాతం నుంచి 1.07 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 4.59 శాతానికి బలపడ్డాయి. ప్రొవిజన్లు రూ. 939 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 233 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 20.14 శాతంగా నమోదైంది. బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో 60.72 శాతం వాటాను విక్రయానికి ఉంచగా ఈ నెల మొదట్లో పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ దాఖలయ్యాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 55 వద్దే ముగిసింది.

చదవండి: అప్పట్లో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి

మరిన్ని వార్తలు