ప్రైవేట్​పరం కానున్న ఐడీబీఐ బ్యాంక్‌, ఎప్పటికంటే

11 Oct, 2022 09:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్రం, ఎల్‌ఐసీ వాటాల విక్రయ ప్రక్రియ వచ్చే సెప్టెంబర్‌ నాటికి పూర్తి కావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మార్చి నాటికల్లా ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 30.24 శాతం .. వెరసి 60.72 శాతం వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గత వారమే ఇందుకోసం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించారు. 

ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డిసెంబర్‌ 16 ఆఖరు తేదీ. రిజర్వ్‌ బ్యాంక్‌ అసెస్‌మెంటు పూర్తి చేసుకుని, హోమ్‌ శాఖ నుంచి భద్రతా క్లియరెన్సులు పొందిన బిడ్డర్లకు బ్యాంకు డేటా రూమ్‌ అందుబాటులోకి వస్తుంది. వివిధ అంశాలన్నింటిని మదింపు చేసుకున్న తర్వాత బిడ్డర్లు ఆర్థిక బిడ్లు దాఖలు చేస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. 

ఐడీబీఐ బ్యాంకును ప్రస్తుతం ప్రైవేట్‌ బ్యాంకుగా వర్గీకరిస్తున్నప్పటికీ అందులో కేంద్రం, ఎల్‌ఐసీకి ఏకంగా 95 శాతం వాటా ఉన్నందున ప్రభుత్వ రంగ సంస్థగానే పరిగణిస్తున్నారు. ప్రత్యేక కేసు కావడంతో వాటాల అమ్మకానికి సంబంధించి సాంకేతిక కారణాల వల్ల ప్రైవేటీకరణ పదం వాడకుండా వ్యూహాత్మక విక్రయం అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం, సాధారణ షేర్‌హోల్డర్లకు 5.2 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం బ్యాంకులో కేంద్రం, ఎల్‌ఐసీల వాటా 94.72 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుంది.   


 

మరిన్ని వార్తలు