గ్లోబల్‌ బులియన్‌ ఎక్ఛేంజీకి శ్రీకారం

19 Aug, 2021 02:21 IST|Sakshi

గిఫ్ట్‌ సిటీలో ప్రయోగాత్మకంగా షురూ

న్యూఢిల్లీ: ప్రయోగాత్మక పద్ధతిలో గుజరాత్, గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ బులియన్‌ ఎక్ఛేంజీ ప్రారంభమైంది. ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) చైర్‌పర్శన్‌ ఇంజేటి శ్రీనివాస్‌ ఎఎక్ఛేంజీని పరిశీలనార్ధం తాజాగా ప్రారంభించారు. ఐఎఫ్‌ఎస్‌సీ వ్యవస్థాపక రోజు సందర్భంగా ఈ ఏడాది(2021) అక్టోబర్‌ 1 నుంచి బులియన్‌ ఎక్ఛేంజీ లైవ్‌ ట్రేడింగ్‌కు వేదిక కానుంది. ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్‌ ప్రొడక్టులు, సర్వీసుల నియంత్రణ, అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌(ఐఎఫ్‌ఎస్‌సీ)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ప్రస్తుతం దేశీయంగా ఇది తొలి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌కాగా.. 2020–21 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంతర్జాతీయ బులియన్‌ ఎక్ఛేంజీకి, క్లియరింగ్‌ కార్పొరేషన్, డిపాజిటరీ, వాల్ట్‌ల నిబంధనలను ప్రకటించారు. వీటిని 2020 డిసెంబర్‌ 11న నోటిఫై చేశారు. వీటితోపాటు కేంద్రం బులియన్‌ స్పాట్‌ ట్రేడింగ్, అండర్‌లైయింగ్‌ బులియన్‌ డిపాజిటరీ రిసీప్ట్స్‌ తదితర ఫైనాన్షియల్‌ ప్రొడక్టులు, సర్వీసులను సైతం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు