ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఫోకస్డ్‌ ఈక్విటీ పథకాలేంటో తెలుసా

31 Oct, 2022 08:19 IST|Sakshi

దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఫోకస్డ్‌ ఈక్విటీ పథకాలు ఎంతో అనుకూలం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అస్థిరతల మధ్య చలిస్తున్న మార్కెట్లో లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకాలకు మించి ఫ్లెక్సీక్యాప్‌ మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. రోలింగ్‌ రాబడులను గమనిస్తే గత ఏడేళ్ల కాలంలో ఇతర పథకాలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్నిచ్చాయి. ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు లార్జ్‌క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక ఆటుపోట్లను మెరుగ్గా తట్టుకోగలవు. మార్కెట్ల ర్యాలీల్లో ఇవి మంచి రాబడులు కూడా ఇస్తాయి. ఈ విభాగంలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫోకస్డ్‌ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. 

రాబడులు 
ఫోకస్డ్‌ ఫండ్స్‌ విభాగంలో ఈ పథకం పనితీరు బలంగా, ఆకర్షణీయంగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అన్ని రకాల కాల వ్యవధుల్లో స్థిరమైన రాబడులతో మెరుగ్గా ఉంది. పోటీ పథకాలతో చూసినా, బెంచ్‌ మార్క్‌ కంటే మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల కాలంలో రోలింగ్‌ రాబడులను గమనిస్తే 2012 నుంచి 2022 అక్టోబర్‌ మధ్య ఈ పథకం ఏటా 16.3 శాతం మేర ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది.

టాప్‌ పథకాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే, దేశీ, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఫండ్‌ ఈ విభాగంలో ఐదేళ్ల కాల రోలింగ్‌ రాబడుల పరంగా మొదటి స్థానంలో ఉంది. ఏటా 16.5 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. అంటే 0.2 శాతం అధిక రాబడులు ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఫండ్‌లో ఉన్నాయి. కానీ ఏడేళ్ల కాలంలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ పథకం ఏటా 16.5 శాతం చొప్పున రాబడిని తెచ్చి పెట్టింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 కంటే 3–4 శాతం అధిక ప్రతిఫలాన్నిచ్చింది.

పాయింట్‌ టు పాయింట్‌ (కచ్చితంగా రెండు కాలాల మధ్య) రాబడుల పరంగా చూస్తే మూడు, ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ విభాగంలో ఈ పథకమే ముందుంది. 2020 మార్కెట్‌ క్రాష్‌లో సూచీలకు అనుగుణంగా 36.5 శాతం మేర నష్టపోయింది.  

పెట్టుబడుల విధానం 
ఈ పథకం వ్యాల్యూ, మూమెంటమ్‌ అనే రెండు రకాల విధానాలతో పెట్టుబడులు పెడుతుంటుంది. మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలోకి ఈ పథకాన్ని చేర్చుకోవచ్చు. కనీసం 7–10 ఏళ్ల పాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. ఇక సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా పెట్టుబడులు పెట్టడం మరింత మెరుగైన ఆప్షన్‌ అవుతుంది.

అన్ని రకాల మార్కెట్‌ విలువలు కలిగిన విభాగాల్లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్‌ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.3,231 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.25 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన 6.75 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. అందులోనూ 72 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌ కంపెనీలకే కేటాయించింది.

మిడ్‌క్యాప్‌లో 13.57 శాతం, స్మాల్‌క్యాప్‌లో 14 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 30 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌కు అత్యధికంగా 32 శాతం మేర పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగానికి 10 శాతం, ఆటోమొబైల్‌ రంగానికి 9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. 

మరిన్ని వార్తలు