తెలుగు రాష్ట్రాల్లో రూ. 7,200 కోట్ల గృహ రుణాలు

14 May, 2022 18:29 IST|Sakshi

2025 నాటికి ఐఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌ లక్ష్యం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికల్లా రూ. 7,200 కోట్ల గృహ రుణాల మంజూరును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (ఐఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌) ఈడీ మోనూ రాత్రా వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4,320 కోట్లు, తెలంగాణలో రూ. 2,880 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17,000 పైచిలుకు కుటుంబాలకు రూ. 2,448 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో హరిత గృహాల నిర్మాణంపై డెవలపర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన 9వ ’కుటుంబ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోనూ ఈ విషయాలు తెలిపారు.

ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌తో (ఏడీబీ) కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ హిత నిర్మాణాలు చేపట్టే డెవలపర్లకు చౌకగా రుణాలివ్వడంలో తోడ్పడేందుకు ఏడీబీ 10 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చిందని వివరించారు. సగటు గృహ రుణ పరిమాణం సుమారు రూ. 15 లక్షలుగా ఉంటోందని మోనూ చెప్పారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 87 శాఖలు ఉన్నాయని, 2023 నాటికి వీటి సంఖ్యను 120కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.  
 

చదవండి: డార్మిటరీలో మొదలైన స్టార్టప్‌.. నేడు 101 బిలియన్‌ డాలర్ల కంపెనీ

మరిన్ని వార్తలు