పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంతంతే!

13 Nov, 2021 04:42 IST|Sakshi

సెప్టెంబర్‌లో 3.1 శాతం అప్‌  

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి సెప్టెంబర్‌లో స్వల్పంగా 3.1 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. మైనింగ్‌ రంగం మెరుగైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. బేస్‌ ఎఫెక్ట్‌ దన్నుతో గడచిన ఆరు నెలలుగా (2021 మార్చి నుంచి ) రెండంకెల్లో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, తన ధోరణిని కొనసాగించకుండా తక్కువ వృద్ధి రేటుకు పడిపోవడం ఆందోళన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం.  

ఎలా అంటే...
2020 సెప్టెంబర్‌లో సూచీ 124.1 పాయింట్ల వద్ద ఉంది. 2021 సెప్టెంబర్‌లో సూచీ 127.9 పాయింట్లకు ఎగసింది. అంటే వృద్ధి 3.1 శాతమన్నమాట. 2019లో సూచీ 122.9 వద్ద ఉంది. కరోనా ముందస్తు కాలంతో పోల్చినా సూచీల్లో పురోగతి ఉన్నా... ఇది అతి స్వల్పంగా మాత్రమే ఉండడం గమనించాల్సిన అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ఈ గణాకాలను విడుదల చేసింది.  

ముఖ్యాంశాలు ఇవీ...
► మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం సెప్టెంబర్‌లో 2.7 శాతం పురోగమించింది.  
► మైనింగ్‌ రంగం వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంది.  
► విద్యుత్‌ ఉత్పత్తి కేవలం ఒక శాతం పెరిగింది.  
► భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం కేవలం 1.3 శాతం లాభపడింది. 2020 ఇదే కాలంలో ఈ రంగం అసలు క్షీణతలో ఉంది.  
► కన్జూమర్, నాన్‌ కన్జూమర్‌ గూడ్స్‌ ఉత్పత్తి క్షీణతలో ఉండడం గమనార్హం. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ తయారీ 2021 సెప్టెంబర్‌లో 2 శాతం క్షీణించింది. నిత్యావసరాలకు సంబంధించి (ఎఫ్‌ఎంసీజీ) నాన్‌ కన్జూమర్‌ గూడ్స్‌ ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి.  
► మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాల మౌలిక  పరిశ్రమల గ్రూప్‌ 4.4 శాతం పురోగమించింది.  సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6% ఎగసింది. ఇక సిమెంట్‌ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది.  క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి 1.7% క్షీణించింది.  ఎరువుల రంగం స్వల్పంగా 0.02% పురోగమించింది.  విద్యుత్‌ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 1% పెరిగింది.  స్టీల్‌ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక  బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1%.

మరిన్ని వార్తలు