ఐఐటీ బాంబే విద్యార్థికి జాక్‌ పాట్‌: కళ్లు చెదిరే ప్యాకేజీ

20 Sep, 2023 14:38 IST|Sakshi

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT-బాంబే) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.  ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో  తమ  విద్యార్థి ఏకంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతనం  దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీ తమ విద్యార్థికి ఈ ఆఫర్ ఇచ్చిందని ఐఐటీ బాంబే తన ప్రకటనలో తెలిపింది. అయితే ఆ విద్యార్థుల పేర్లు, ఆఫర్‌ ఇచ్చిన కంపెనీల వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

మరో విద్యార్థికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నట్టు తెలిపింది.  గత సంవత్సరం అంతర్జాతీయ ఆఫర్ రూ. 2.1 కోట్లతో పోల్చితే ఇది గణనీయమైన పెరుగుదల అని పేర్కొంది. అయితే అంతకుముందు సంవత్సరం దేశీయ ఆఫర్ వార్షికంగా  రూ. 1.8 కోట్లుగా ఉంది.

2022-23 ప్లేస్‌మెంట్‌ల వివరాల ప్రకారం  300 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లలో 194 మంది విద్యార్ధులు జాబ్స్ అంగీకరించారు. ఇందులో వార్షిక వేతనం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఆఫర్లు 16. IIT-బాంబేలోని విద్యార్థులు అమెరికా జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ ,  తైవాన్‌లలో సంస్థల నుండి ఈ సంవత్సరం 65 విదేశీ ఉద్యోగ ఆఫర్‌లను అందుకున్నారు. మొత్తంగా, 2022-23 ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 82 శాతం మంది విద్యార్థులు సక్సెస్‌ అయ్యారని, బిటెక్, డ్యూయల్ డిగ్రీ , ఎంటెక్ ప్రోగ్రామ్‌ల నుండి దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారనీ తెలిపింది. ఈ ఏడాది ఇంతమంది భారీ వేతనంతో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంపై ఐఐటీ బాంబే సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు