ఐకియా: ఇదెక్కడి క్రేజ్‌రా బాబోయ్‌! వైరల్‌ వీడియోస్‌

27 Jun, 2022 11:40 IST|Sakshi

బెంగళూరు: స్వీడిష్ ఫర్నిచర్ రిటైలర్ ఐకియా ఇటీవల (జూన్ 22న) బెంగళూరులో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. అప్పటినుంచి బెంగళూరు ప్రజలు ఈ మాల్‌కు క్యూ కట్టారు. ఒకేసారి వందల సంఖ్యలో కస్టమర్లు ఐకియాకు తరలి వచ్చారు. అందులోనూ వీకెండ్‌ కావడంతో శనివారం మరింత రద్దీ నెలకొంది. భారీగా నెలకొన్న క్యూలతో వినియోగదారులను కట్టడి చేయడం,సెక్యూరిటీ కల్పించడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారిపోయింది. దీనిపై ఫోటోలు, ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా షేర్‌  అవుతూ సందడి చేస్తున్నాయి.   

గంటలకొద్దీ  పెద్ద పెద్ద క్యూలైన్లలో   కస్టమర్లు వేచి  ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. దీంతో దెబ్బకి ఐకియా స్పందించి ట్విటర్‌లో ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. తమ స్టోర్‌కు వస్తున్న స్పందన దిగ్భ్రాంతి  కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం స్టోర్‌లో వేచి ఉండే సమయం 3 గంటలకు చేరింది. దయచేసి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మహానుభావా.. లేదా ఆన్‌లైన్‌ షాపింగ్ చేయండి అని వేడుకుంటూ  ఐకియా ఇండియా తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేయడం గమనార్హం.

మరోవైపు దీనిపై వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్‌ చేశారు. ఇది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్యూలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు, ఇమ్మిగ్రేషన్ క్యూ కాదు, కోవిడ్ టీకా క్యూ  కానే కాదు, దర్శనం కోసం తిరుపతిలో క్యూలో నిల్చున్న భక్తుల క్యూ అంతకన్నాకాదు. ఇది బెంగళూరులో ఐకియా స్టోర్ ప్రారంభోత్సవం! అంటూ ఒక వీడియోను షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు