ఐఎండీ రీసెర్చ్‌: భవిష్యత్‌ సన్నద్ధతలో భారత్‌ కంపెనీలు ఎందుకు లేవంటే..

16 Dec, 2021 10:55 IST|Sakshi

IMD Research On Future Readiness Companies: భవిష్యత్‌లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలతో సన్నద్ధంగా ఉన్న కంపెనీల జాబితాలో టెస్లా, లులులెమన్, మాస్టర్‌కార్డ్, గూగుల్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎండీ) రూపొందించిన నివేదికలో ఈ అంశం  వెల్లడైంది.

ఫ్యాషన్‌..రిటైల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ అనే నాలుగు రంగాల్లో అ త్యధికంగా ఆదాయాలు ఆర్జిస్తున్న 86 లిస్టెడ్‌ కంపెనీలను వాటి పోటీ కంపెనీలతో పోల్చి, భవిష్యత్‌ను ఎదుర్కొనేందుకు అవి ఎంత సంసి ద్ధంగా ఉన్నాయి, వాటి నిలదొక్కుకునే సామర్థ్యా లేమిటి తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం దశాబ్ద కాలం (2010–2021) పైగా డేటాను పరిశీలించారు. 

ఈ జాబితాలో 40 అమెరికన్‌ కంపెనీలు, చైనా.. జర్మనీ నుంచి చెరి ఏడు, ఫ్రాన్స్‌.. జపాన్‌ నుంచి చెరి ఆరు కంపెనీలకు చోటు దక్కింది. నివేదిక ప్ర కారం ఫ్యాషన్‌.. రిటైల్‌లో లులులెమన్, నైకీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్‌ సెగ్మెంట్‌లో టెస్లా, టయోటా టాప్‌ 2 స్థానాల్లో నిల్చా యి. ఆర్థిక సేవల విభాగంలో మాస్టర్‌కార్డ్, వీసా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. టెక్నాలజీ లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ టాప్‌ 3లో నిలిచినట్లు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక పేర్కొంది. 

భారత్‌ కంపెనీలు ఎందుకు లేవంటే.. 
ఐఎండీ లిస్టులో భారత కంపెనీలేవీ చోటు దక్కించుకోలేకపోయాయి. ఇందుకు భారత్‌లో మౌలిక సదుపాయాలపరమైన సమస్యలే కారణమని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్‌ హోవార్డ్‌ యు తెలిపారు. ‘ఆటోమోటివ్‌ రంగంలోని టాప్‌ కంపెనీల్లో భారత్‌ నుంచి ఒక్కటి కూడా లేవు. అలాగని టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలు కొత్తవి ఆవిష్కరించలేవని కాదు. అవి చేయగలవు. కానీ రేపటితరం స్మార్ట్‌ వాహనాలన్నీ నగరంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుసంధానించే సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్మకాలు పుంజుకోవాలన్నా సూపర్‌చార్జర్ల విస్తృత నెట్‌వర్క్‌ అవసరమవుతుంది. చైనాలోని ఎన్‌ఐవో, బీవైడీ వంటి ఆటోమోటివ్‌ సంస్థలు తమ సొంత నెట్‌వర్క్‌తో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వల్ల కూడా ప్రయోజనం పొందుతుంటాయి. 

ప్రభుత్వ స్థాయిలో మద్దతు లేకుండా ఎన్‌ఐవో సొంతంగా బ్యాటరీ మార్పిడి స్టేషన్లను అభివృద్ధి చేయడం అసాధ్యం. కాబట్టి భారత్‌లోనూ అదే తరహాలో మౌలిక సదుపాయాల కల్పనల సమస్యల పరిష్కారంపై రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలి‘ అని హొవార్డ్‌ పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారత్‌కి ఇంకా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే, యూనికార్న్‌ల (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లు) సంఖ్యాపరంగా భారత్, ఈ ఏడాది చైనాను అధిగమించిందని హొవార్డ్‌ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఓలా వంటి వంటివి దేశీ స్టార్టప్‌ వ్యవస్థలో పెను సంచలనాలు సృష్టించాయని పేర్కొన్నారు.  

చదవండి: టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎలన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు