భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ఐఎంఎఫ్

27 Jul, 2021 20:02 IST|Sakshi

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ భారత వృద్ధి అంచనాలను మరోసారి భారీగా కుదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత ఏకంగా మూడు పాయింట్లు తగ్గించింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి భారతదేశం ఆర్థిక వృద్ధి రేటును ఏప్రిల్ 2021లో అంచనా వేసిన 6.9 శాతం నుంచి 8.5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. "మార్చి-మేలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో వృద్ధి అవకాశాలు తగ్గించినట్లు, ఆ ఎదురుదెబ్బ నుంచి ఆర్ధిక వృద్ది నెమ్మదిగా రికవరీ కానున్నట్లు" ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ (డబ్ల్యుఈఓ)లో తెలిపింది.

ఐఎంఎఫ్ 2021 ప్రపంచ వృద్ధి అంచనాను మార్చకుండా 6 శాతం వద్దే ఉంచింది. వ్యాక్సిన్ రోల్ అవుట్ లో వ్యత్యాసం కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ది అంచనాలను సవరించింది. 2021 జూన్ 4న జరిగిన రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కూడా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐఎంఎఫ్ భారతదేశానికి ఆర్థిక వృద్ధి అంచనాలను మూడు శాతం, చైనాకు 0.3 శాతం, సౌదీ అరేబియాకు 0.5 శాతం తగ్గించింది. మెక్సికో, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో సహా మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ పెంచింది. 
 

మరిన్ని వార్తలు