భారత్‌ వృద్ధికి ఐఎంఎఫ్‌ రెండో కోత

12 Oct, 2022 09:18 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. భారత్‌ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది.

అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్‌ కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్‌లుక్‌ విడుదలైంది.
 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)సహా పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక, విశ్లేషణా సంస్థలు 2022–23 భారత్‌ వృద్ధి అంచనాలను కుదిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుండడం గమనార్హం. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతం. ఐఎంఎఫ్‌ మంగళవారం విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’లో ఈ విషయాలను వెల్లడించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) భారత్‌ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిందని విశ్లేషించింది. అంతర్జాతీయ డిమాండ్‌ తగ్గడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తోందని వివరించింది.  

ప్రపంచ వృద్ధి 3.2 శాతమే... 
2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్‌ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్‌ అంచనావేసింది. 2001 తర్వాత ప్రపంచ వృద్ధి ఈ స్థాయిలో బలహీనపడటం (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌–19 తీవ్ర స్థాయి కాలాలతో పోల్చితే) ఇదే తొలిసారి. అవుట్‌లుక్‌ ప్రకారం, అమెరికా జీడీపీ 2022 తొలి భాగంలో క్షీణతలోకి జారింది. 2023లో ఒక శాతం వృద్ధి నమోదుకావచ్చు. 

మరిన్ని వార్తలు