ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఐఎంఎఫ్‌ కితాబు

26 Sep, 2020 07:06 IST|Sakshi

స్వావలంభన దిశలో కీలక కార్యక్రమంగా అభివర్ణన

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారత్‌) కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ‘‘స్వావలంబన భారత్‌ (తన అవసరాలకు తనపైనే ఆధారపడడం) కార్యక్రమం కింద ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు సాయపడింది. మరింత అగాథంలోకి పడిపోకుండా కాపాడింది. కనుక ఈ కార్య్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నాము. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.

అందుకు ఆర్థిక వ్యవస్థ సామర్థ్య, పోటీతత్వాన్ని ఇనుమడింపజేసే విధానాలను అనుసరించడం కీలకమవుతుంది. ప్రపంచం కోసం తయారీ అన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను.. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ మరింతంగా చొచ్చుకునిపోయే విధానాలపై దృష్టి పెట్టాలి’’ అంటూ ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ గెర్రీరైస్‌ వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో స్థిరమైన వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్‌ జీడీపీలో ప్రస్తుతం ఈ రంగానికి కేటాయిస్తున్న 3.7 శాతాన్ని క్రమంగా పెంచాల్సి ఉందన్నారు. మధ్య కాలానికి మరింత సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు సమగ్రమైన, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు