తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ వెనుకన భారత్‌!

14 Oct, 2020 11:32 IST|Sakshi

ఐఎంఎఫ్‌ అంచనా

సాక్షి, న్యూఢిల్లీ : తలసరి జీడీపీలో ఈ కేలండర్‌ సంవత్సరంలో బంగ్లాదేశ్‌ భారత్‌ను అధిగమించనుంది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో తలసరి జీడీపీలో భారీ కోత తప్పదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) నివేదిక స్పష్టం చేసింది. 2020లో బంగ్లాదేశ్‌లో తలసరి జీడీపీ 1888 డాలర్లతో 4 శాతం వృద్ధి చెందుతుందని, భారత్‌లో తలసరి జీడీపీ  గత నాలుగేళ్ల కనిష్టస్ధాయిలో 10.5 శాతం తగ్గి 1877 డాలర్లకు పడిపోతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే దక్షిణాసియలో భారత్‌ మూడవ అత్యంత పేద దేశంగా నిలవనుంది.

భారత్‌ తర్వాత పాకిస్తాన్‌, నేపాల్‌లు తక్కువ తలసరి జీడీపీని కలిగిఉండగా..బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక, మాల్దీవులు భారత్‌ కంటే ముందున్నాయి. దక్షిణాసియాలో శ్రీలంక తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని డబ్ల్యూఈఓ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా నేపాల్‌, భూటాన్‌లు ఈ ఏడాది ఆర్థిక వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. అయితే 2020 ఆపైన పాకిస్తాన్‌కు సంబంధించిన గణాంకాలు, అంచనాలను ఐఎంఎఫ్‌ వెల్లడించలేదు. వచ్చే ఏడాది భారత్‌లో ఆర్థిక రికవరీ చోటుచేసుకుంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అదే జరిగితే 2021లో తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ను భారత్‌ అధిగమించే అవకాశం ఉంది. చదవండి : కోవిడ్‌-19 సం‍క్షోభం సమసిపోలేదు

మరిన్ని వార్తలు