India GDP: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్‌..!

20 Apr, 2022 08:08 IST|Sakshi

ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ 

2022 వృద్ధి అంచనా 8.2 శాతం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇదే టాప్‌

చైనా వృద్ధి 4.4 శాతానికి పరిమితం  

వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 8.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని విశ్లేషించింది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్‌ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యసవ్థ చైనా 4.4 శాతం పురోగతి సాధిస్తుందని బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ విడుదల చేసిన వార్షిక వరల్డ్‌ ఎకనమిక్‌

అవుట్‌లుక్‌ నివేదికలోని కొన్ని అంశాలు... 
► 2022 భారత్‌ ఎకానమీ వృద్ధి తాజా అంచనా 8.2 శాతం అయినప్పటికీ, ఇది క్రితం అంచనాల కన్నా 80 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తక్కువ కావడం గమనార్హం. 
► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కమోడిటీ, ఆహార ధరల పెరుగుదల, బలహీన దేశీ డిమాండ్, ప్రైవే టు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడం వంటి అంశాలు వృద్ధి అంచనా తగ్గింపు కారణం.  
► 2021లో భారత్‌ వృద్ధి 8.9 శాతం. 2023లో 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా.  

ప్రపంచ వృద్ధి 3.6 శాతం 
కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ అంచనావేసింది. ఈ మేరకు క్రితం (జనవరిలో 4.4 శాతంగా అంచనా) అంచనాలకన్నా 80 బేసిస్‌ పాయింట్లు కుదించింది. భౌగోళిక ఉద్రిక్తతలను దీనికి కారణంగా చూపింది.    2021 ప్రపంచ వృద్ధి 6.1 శాతం. 2023లో ప్రపంచ వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి కుదించింది.  ఇక 2021లో 8.1 శాతం పురోగమించిన చైనా వృద్ధి రేటు 2022లో 4.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 5.1 శాతంగా ఉంటుందని అంచనావేసింది. అమెరికా 2022లో 3.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 2.3 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ప్రపంచ వృద్ధి వేగం తగ్గడానికి రష్యా యుద్ధం ప్రధాన కారణంగా చూపిన ఐఎంఎఫ్, 2022లో ఆ దేశ ఎకానమీ 8.5 శాతం క్షీణిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్‌ విషయంలో ఈ క్షీణత 35 శాతంగా అంచనా వేసింది. ఇక 19 దేశాల యూరో దేశాల ఎకానమీ 2022 వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 2.8 శాతానికి కుదించింది. 

చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!

మరిన్ని వార్తలు