పన్ను భారం తగ్గించుకోవాలంటే..

6 Feb, 2023 04:41 IST|Sakshi

ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌ మెరుగు

బీమా, రాబడి కోసం యులిప్‌లు

ఎన్‌ఎస్‌సీ, ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలు

కేవలం పన్ను ఆదా ఒక్కటే చూడొద్దు

రిస్క్, రాబడి కోణంలో ఎంపిక ఉండాలి

వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది.  

ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు.

ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్‌ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ అన్నది సెక్షన్‌ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు.   

ఎన్‌పీఎస్‌– మూడు ప్రయోజనాలు
ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్‌ వరకు లాకిన్‌లోనే ఉంటాయి. డెట్‌ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్‌పీఎస్‌కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్‌ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్‌పీఎస్‌కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు.

సెక్షన్‌ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కనుక ఎన్‌పీఎస్‌ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్‌ బాండ్స్, గవర్నమెంట్‌ బాండ్స్‌ (గిల్ట్‌ ఫండ్స్‌) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్‌ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్‌. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ విభాగం కూడా ఉంది.  

జీవిత బీమా పథకాలు
జీవిత బీమా ఎండోమెంట్‌ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్‌ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్‌ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి.

ఎన్‌ఎస్‌సీ, పన్ను ఆదా ఎఫ్‌డీలు
ఎన్‌ఎస్‌సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్‌డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్‌ పీరియడ్‌ ఐదేళ్లు. ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీపై డీసీబీ బ్యాంక్‌ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్‌ చేస్తుంటే, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్‌డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్‌ఎస్‌సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్‌ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడిని సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది.  

యులిప్‌లు
యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్‌ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్‌లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్‌ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు.

రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్‌ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్‌ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు.  

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌
ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్‌ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్‌ అమలు చేస్తారు.

పీపీఎఫ్‌
ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్‌ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్‌నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.  

సుకన్య సమృద్ధి యోజన
ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు.

రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌
వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్‌ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్‌ పెన్షన్‌ ఫండ్, యూటీఐ రిటర్మెంట్‌ బెనిఫిట్‌ పెన్షన్‌ ఫండ్‌ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్‌ తక్కువ. తక్కువ రిస్క్‌ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్‌ కోసం వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్‌ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్‌ ఫండ్స్‌ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు.  
 

మరిన్ని వార్తలు