ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు

24 Sep, 2021 05:29 IST|Sakshi

పరిష్కారంపై కొనసాగుతున్న ఇన్ఫీ కసరత్తు

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను పోర్టల్‌ను ఉపయోగించడంలో ఇంకా కొంతమందికి సమస్యలు ఎదురవుతూనే ఉన్నది వాస్తవమేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంగీకరించింది. అయితే, ఐటీ విభాగంతో కలిసి వీటిని వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. గత కొన్ని వారాలుగా ఐటీ పోర్టల్‌ వినియోగం క్రమంగా పెరుగుతోందని, సుమారు మూడు కోట్ల మంది పైగా పన్ను చెల్లింపుదారులు లాగిన్‌ అయ్యి విజయవంతంగా వివిధ లావాదేవీలు పూర్తి చేశారని ఒక ప్రకటనలో వివరించింది. కొందరు యూజర్లు సవాళ్లు ఎదుర్కొనడం తాము గుర్తించామని, వీటిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి 1,200 మంది ట్యాక్స్‌పేయర్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ప్రస్తుతం 750 మంది పైగా తమ సిబ్బంది ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారని పేర్కొంది.  

రిటర్నుల ప్రాసెసింగ్‌కు పడుతున్న 63 రోజుల సమయాన్ని ఒక్క రోజుకు కుదించేందుకు, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించి.. కొత్త ఐటీ పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్టును 2019లో ఇన్ఫీ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్‌లో కొత్త పోర్టల్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతిక లోపాలు పోర్టల్‌ను వెన్నాడుతూనే ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు