పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట

13 Aug, 2021 19:52 IST|Sakshi

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలుగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా సాధారణ పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఆదాయపు పన్ను శాఖ ఇంతకు ముందు ఐటీఆర్ దాఖలు చేసే గడువును జూలై 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే, గడువు పొడగించిన తర్వాత కొత్త పోర్టల్ ద్వారా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో అదనపు వడ్డీ, ఆలస్యం రుసుము వసూలు చేసినట్లు చాలా మంది పన్ను చెల్లింపుదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొన్న సమస్యని పరిగణలోకి తీసుకోని ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఉపయోగించే ఐటీఆర్ పోర్టల్‌లో ఉన్న లోపాలను ఆదాయపు పన్ను శాఖ సరిచేసింది. అలా జూలై 31 తర్వాత నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తుంది.

మరిన్ని వార్తలు