ఐటీఆర్ ఫైలింగ్ కోసం మొబైల్ యాప్!

28 Jul, 2021 20:20 IST|Sakshi

ఈ మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీని రెండు నెలలు పొడగించింది. కొత్త గడువు ప్రకారం, 30 సెప్టెంబర్ 2021 వరకు ఎప్పుడైనా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. అయితే ఇంతకు ముందు ఈ గడువు తేదీ 31 జూలై 2021 వరకు ఉండేది. ప్రజలకు పన్ను దాఖలు సులువుగా చేయడం కొరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్, మొబైల్ యాప్ లో కీలకమైన ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రజల దగ్గరకు చేరడం కొరకు గతంలో ఆదాయపు పన్ను శాఖ "ఆయకర్‌ సేతు" పేరుతో యాప్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్‌తో ఇప్పుడు మీరు మీ ఐటీఆర్ ని సులభంగా ఫైల్ చేయవచ్చు. 

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0లో సరికొత్త మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్లు భారత ఆదాయపు పన్ను శాఖ ఇంతకు ముందు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మొబైల్ యాప్ ను జూన్ 7, 2021న లాంఛ్ చేసింది. ఈ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఐటీ రిటర్న్ ఈ-ఫైలింగ్ పోర్టల్, కొత్త మొబైల్ యాప్‌ను పన్ను చెల్లింపుదారులు సులభంగా ఉపయోగించవచ్చని డిపార్ట్ మెంట్ పేర్కొంది.

అంతేగాక, మొబైల్ యాప్ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం, ముందస్తుగా నింపిన ఆదాయపు పన్ను వివరాలు, సరళ ఆదాయపు పన్ను సౌకర్యం, రీఫండ్ క్లెయిం, ఇతర సౌకర్యాలు వంటి సమాచారాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్‌ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు