Income Tax New Rules 2022-23: స్క్రూటినీ కేసుల ఎంపిక

23 May, 2022 14:41 IST|Sakshi

ఈ నెల మొదటి వారంలో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కం ట్యాక్స్‌ కేసులను ఏయే ప్రాతిపదికన స్క్రూటినీకి ఎంపిక చేస్తారనేది తెలియజేశారు.  ఒక కేసును స్క్రూటినీకి ఎంపిక చేశారంటే తగిన కారణం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రిటర్ను దాఖలు చేసిన తర్వాత అందులోని అంశాలను పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో అన్నీ మామూలుగానే ఉంటే అసెస్‌ చేసి, కేసుని క్లోజ్‌ చేస్తారు. రిఫండ్‌ ఉంటే ఇస్తారు. డిమాండ్‌ ఉంటే కట్టమని సెలవిస్తారు. తప్పొప్పులు సరి చేసి ఆర్డర్లు తయారు చేస్తారు. తప్పొప్పులు లేకపోతే మీరు ధన్యులు. అసెస్‌మెంట్‌ పూర్తయినట్లు. అయితే, అసెస్‌మెంట్‌తో సంబంధం లేకుండా కూడా ఈ కింది తరహా కేసులను స్క్రూటినీకి ఎంపిక చేస్తారు.  

-    సర్వే జరిగిన తర్వాత సర్వేలో బైటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని, రిటర్నులు వేసిన వారి కేసులు 
-    సెర్చి జరిగిన కేసుల్లో, బైటపడ్డ విషయాల ఆధారంగా వేసిన రిటర్నులు 
-    సీజ్‌ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అంశాల ఆధారంగా దాఖలు చేసిన రిటర్నులు 
-    అధికారులు రిటర్నులు వేయమని నోటీసులిచ్చినా రిటర్నులు దాఖలు చేయకుండా దాటవేసిన వారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నోటీసు ఇచ్చే వేళకు, వారి దగ్గర సమగ్ర సమాచారం, ముఖ్యమైన వివరాలు ఉంటాయి. 
-    ఎగవేత కేసుల్లో నోటీసులు ఇస్తారు. నోటీసుకు బదులుగా రిటర్ను వేసినా, వేయకపోయినా అటువంటి కేసులను స్క్రూటినీకి ఎంపిక చేస్తారు. 
-    కొన్ని సెక్షన్ల ప్రకారం నమోదు చేసుకున్న సంస్థలు వేసే రిటర్నులు (ఈ సంస్థలకు నమోదు చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.. అవి దుర్వినియోగం అవుతాయనే అనుమానంతో). ఉదాహరణకు ట్రస్టులు, ధార్మిక సంస్థలు మొదలైనవి. 
-    ఏయే అసెస్‌మెంట్లలో ‘‘అదనంగా’’ ఆదాయం బైటపడిందో ఆ కేసులు. పెద్ద నగరాల్లో రూ. 25 లక్షలు దాటినా, ఇతర ప్రాంతాల్లో రూ. 10 లక్షలు దాటినా 
-    ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్‌ వారి ద్వారా బైటపడ్డ ఎగవేత కేసులు 
ఇవి కాకుండా పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు జరిగినప్పుడు డిపార్ట్‌మెంట్‌ .. ఆయా వర్గాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఎన్నో నిర్దేశిత సంస్థలు ప్రతి సంవత్సరం వార్షిక రిటర్నుల ద్వారా సమాచారం తెలియచేయాలి. ఈ రోజుల్లో సమాచారం సులువుగా సేకరించవచ్చు. ఆట్టే కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి వ్యవహారం డిపార్ట్‌మెంట్‌ వారికి తెలుసు. వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేయకండి. వ్యవహారాలు జరిగినప్పటికీ సంబంధిత కాగితాలు, తగిన కారణం, సరైన వివరణ ఉంటే కేసులను సజావుగా పరిష్కరించుకోవచ్చు.

- కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

మరిన్ని వార్తలు