రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి

24 Nov, 2022 06:28 IST|Sakshi

బ్యాంకింగ్‌కు ఆర్థికశాఖ సహాయ మంత్రి కరాద్‌ విజ్ఞప్తి  

శ్రీనగర్‌: బ్యాంకులు వివిధ రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్‌ కోరారు.  ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పించాలని  మంగళవారం విజ్ఞప్తి చేశారు. కేంద్రపాలిత ప్రాంత స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ఆర్థిక అభివృద్ధిలో సాధారణంగా విద్య ఎంత కీలకమో ఆర్థిక అక్షరాస్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ‘‘బ్యాంకులు వివిధ రుణ పథకాల గురించి ప్రజలలో అవగాహన పెంచాలి. దీనివల్ల ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు వారికి అందుతాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► పీఎం సేవానిధి స్కీమ్‌లో రుణగ్రహీతల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పథకం లబ్ధిదారులను మార్గనిర్దేశం చేసి, పీఎం ముద్రా యోజన కింద అధిక రుణాలు పొందే అర్హతను వారు పొందేందుకు కృషి జరగాలి.  
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చొరవలతో జమ్మూ, కశ్మీర్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక్కడ బ్యాంకింగ్‌ పోషిస్తున్న పాత్ర పట్ల సంతృప్తి ఉంది. జమ్మూ, కశ్మీర్‌లో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవల విస్తరణకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందిస్తుంది.  
► గత రెండేళ్లలో దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ప్రశంసనీయమై­న పనితీరును కనబరిచాయి. ఇది అభినందనీయం.  

మరిన్ని వార్తలు