భారీగా పెరిగిన అమ్మకాలు, ఇంధనానికి మళ్లీ డిమాండ్‌

17 Jun, 2021 10:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌లను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ఇంధనాలకు మళ్లీ డిమాండ్‌ మెరుగుపడింది. జూన్‌ ప్రథమార్ధంలో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్‌ సంస్థల గణాంకాల ప్రకారం మే ప్రథమార్ధంతో పోలిస్తే జూన్‌ 1–15 మధ్య కాలంలో పెట్రోల్‌ అమ్మకాలు 13 శాతం, డీజిల్‌ విక్రయాలు 12 శాతం పెరిగాయి. మార్చి తర్వాత నెలవారీగా అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. ఇంధనాల విక్రయాలు.. మార్చి నెలలో కోవిడ్‌–19 పూర్వస్థాయికి దాదాపు సమీపానికి వచ్చాయి. కానీ ఇంతలోనే కరోనా వైరస్‌ సెకం డ్‌ వేవ్‌ వ్యాప్తి నిరోధించేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రవాణా, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా 2020 ఆగస్టు తర్వాత ఈ ఏడా ది మేలో ఇంధనాల వినియోగం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. జూన్‌ ప్రథమార్ధంలో పుం జుకున్నప్పటికీ.. గతేడాది జూన్‌ ప్రథమార్ధంతో పోలిస్తే వినియోగం ఇంకా తక్కువే ఉండటం గమనార్హం. తాజాగా డీజిల్‌ అమ్మకాలు 2.48 మిలియన్‌ టన్నులుగా, పెట్రోల్‌ అమ్మకాలు 9,04,900 టన్ను లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్‌ ప్రథమార్ధంతో పోలిస్తే డీజిల్‌ విక్రయాలు 7.5 శాతం, పెట్రోల్‌ అమ్మకాలు 3.5 శాతం తగ్గాయి. ఇక కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే డీజిల్‌ వినియోగం 21.4%, పెట్రోల్‌ వినియోగం 20.7 % క్షీణించింది. 

వంట గ్యాస్, ఏటీఎఫ్‌ డౌన్‌.. 

తొలి విడత లాక్‌డౌన్‌లో గణనీయంగా పెరిగిన ఏకైక ఇంధనం వంట గ్యాస్‌ అమ్మకాలు నెలవారీగా చూస్తే తాజా జూన్‌ ప్రథమార్ధంలో 1.3 శాతం క్షీణించి 1.1 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. అయితే, గతేడాది జూన్‌తో పోలిస్తే 14.6 శాతం, 2019 జూన్‌లో పోలిస్తే 2.19 శాతం పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ ఇంకా పూర్తి స్థాయిలో సర్వీసులు నడపడం లేదు. దీంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) విక్రయాలు నెలవారీగా 17.4 శాతం క్షీణించి 1,07,400 టన్నులకు పరిమితమయ్యాయి. 2020 జూన్‌తో పోలిస్తే మాత్రం 13.2 శాతం పెరిగినప్పటికీ  2019 జూన్‌తో పోలిస్తే 65.5 శాతం క్షీణించాయి.

చదవండి: సోనీ టీవీ ఓటీటీ ప్లాట్ ఫాం ‘హెడ్‌’గా ప్ర‌ముఖ‌ టాలీవుడ్‌ నిర్మాత

మరిన్ని వార్తలు