తయారీ రంగంపై పెరిగిన రుణ వ్యయ భారం 

15 Mar, 2023 02:54 IST|Sakshi

జనవరి–మార్చి త్రైమాసికంలో వార్షిక వడ్డీ రేటు 9.38 శాతం

అంతక్రితం క్వార్టర్‌లో 8.37 శాతం

అయినా, పరస్థితులపై ఆశావహ దృక్పధం

పారిశ్రామిక వేదిక ఫిక్కీ నివేదిక  

న్యూఢిల్లీ: తయారీదారులు చెల్లించే వార్షిక సగటు వడ్డీ రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 9.38 శాతానికి పెరిగింది. అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ఈ రేటు 8.37 శాతంగా ఉంది. సగటు కాకుండా చూస్తే,  ఈ రేటు కొన్ని సంస్థల విషయంలో అత్యధికంగా 15 శాతంగా నమోదయ్యింది.  

చాలా కంపెనీలు తమ రుణాల వ్యయం పెరిగినట్లు తెలిపాయని తాజాగా విడుదలైన పారిశ్రామిక వేదిక– ఫిక్కీ సర్వే తెలిపింది. అయితే భారత ఎకానమీ పరిస్థితుల పట్ల సర్వేలో ఆశావహ దృక్పధం నెలకొంది.  సర్వే ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

కరోనా సవాళ్ల అనంతరం, 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ రికవరీ బాట పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరపు తదుపరి త్రైమాసికాల్లో వృద్ధి ఊపందుకోవడం కొనసాగింది. 
 ప్రపంచ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ప్రభావం  భారత తయారీ రంగంపై తాత్కాలికంగానే ఉంటుంది. గడచిన కొన్ని నెలలుగా ఈ రంగంలో నెలకొన్న వ్యయ భారాలు తగ్గుముఖం పడతాయన్న విశ్వాసం నెలకొంది.  
 నియామకాలకు సంబంధించి అవుట్‌లుక్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ, రాబోయే మూడు నెలల్లో అదనపు వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని కేవలం 32 శాతం మంది ప్రతినిధులు మాత్రమే  పేర్కొంటున్నారు.  
గత కొన్ని నెలల్లో రెపో రేట్లను పెంచడం వల్ల పర్యవసానంగా తమ బ్యాంకులు ఈ భారాన్ని తమకు బదలాయించాయని, ఇది రుణ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణమని 71 శాతం మంది ప్రతినిధులు తెలిపారు.  
తయారీలో ప్రస్తుతం ఉన్న సగటు సామర్థ్య వినియోగం 75%. ఇది ఈ రంగంలో స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. క్రితం  సర్వే లో ఈ సామర్థ్య వినియోగం  70%గా ఉంది.  
భవిష్యత్‌ పెట్టుబడి ఆశావహ దృక్పథం కూడా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే మెరుగుపడింది. రాబోయే ఆరు నెలల్లో పెట్టుబడులు,  విస్తరణ ప్రణాళికల్లో ఉన్నట్లు 47 శాతం మంది ప్రతివాదులు  తెలిపారు.   అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 40 శాతంగా ఉంది.  
 అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం  కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశి్చతి, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇతర దేశాలలో కోవిడ్‌ వైరస్‌ వేరియంట్ల పెరుగుదల, ఆందోళనల వంటి సవాళ్లు తయారీ రంగాన్ని వెంటాడుతున్నాయి.  సరఫరాల చైన్, డిమాండ్‌లో అస్థిరతలను పెంచుతున్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు.  
 పెరుగుతున్న ఫైనాన్స్‌ రుణ భారాలు, నిబంధనలు–అనుమతుల్లో గందరగోళ పరిస్థితులు,  అధిక ఇంధన ధరలు, మందగమన ప్రపంచ డిమాండ్, భారతదేశంలోకి అధిక చౌక దిగుమతులు, నైపుణ్యం కలిగిన కార్మీకుల కొరత, కొన్ని లోహాల అధిక అస్థిర ధరలు, సరఫరాల చైన్‌లో అనిశ్చితి, లాజిస్టిక్స్‌ వ్యయాల పెరుగుదల వంటి అంశాలూ సవాళ్లలో ఉన్నాయి. ఇవి తమ విస్తరణ ప్రణాళికకు అవరోధంగా మారే అవకాశం ఉందని తయారీ రంగ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.  

సర్వే సాగింది ఇలా... 
11 ప్రధాన రంగాలకు సంబంధించి క్యూ4లో తయారీదారుల అభిప్రాయాలను  సర్వే మదింపు చేసింది.  మొత్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ను కలిగిన భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ)ల విభాగాలలోని 400 తయారీ యూనిట్ల నుండి స్పందనలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

ఆటోమోటివ్, ఆటో కంపోనెంట్స్, భారీ పెట్టుబడులు–డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్‌ గూడ్స్, సిమెంట్, రసాయనాలు, ఔషధాలు, ఎల్రక్టానిక్స్, మిషీన్‌ టూల్స్, మెటల్‌ అండ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్, పేపర్‌ ప్రొడక్ట్స్, ఎరువులు, జౌళి, దుస్తులు తదితర రంగాలు వీటిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు