పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా

1 Nov, 2021 13:02 IST|Sakshi

పెట్రోల్‌ ధరలతో కేంద్రానికి ప్రయోజనం 

గతేడాదితో పోలిస్తే 33 శాతం అధిక ఆదాయం  

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన ఎక్సైజ్‌ సుంకాలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరుతోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం 79 శాతం పెరిగినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

గల్లా పెట్టే గలగల
కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వద్ద అందుబాటులోని సమాచారాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఎక్సైజ్‌ సుంకాల రూపంలో ఆదాయం రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అంటే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం అధికంగా సమకూరింది. ఇక కరోనా రావడానికి ముందు 2019లో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.95,930 కోట్లుగానే ఉంది. 

ఎక్సైజ్‌ సుంకమే కీలకం
గతేడాది కరోనా వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు గణనీయంగా పడిపోవడం తెలిసిందే. ఆ సమయంలో ఆదాయంలో లోటు సర్దుబాటు కోసం కేంద్ర సర్కారు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలను పెంచేసింది. ఆ తర్వాత పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టాలకు చేరినప్పటికీ.. పూర్వపు సుంకాలనే కొనసాగిస్తుండడం గణనీయమైన ఆదాయానికి తోడ్పడుతోంది. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ వసూళ్లు రూ.3.89 లక్షల కోట్లు కాగా, 2019–20లో ఈ మొత్తం రూ.2.39 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజ వాయువులపైనే విధిస్తున్నారు.   
 

చదవండి:పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు

మరిన్ని వార్తలు