India Ad Market: దేశీ ‘యాడ్స్‌’ మార్కెట్‌ 16 శాతం అప్‌

16 Jul, 2022 11:50 IST|Sakshi

2022లో రూ. 88,639 కోట్లకు చేరిక 

డిజిటల్, టీవీ మాధ్యమాల దన్ను 

డెంట్సు గ్లోబల్‌ యాడ్‌ స్పెండ్‌ అంచనాలు  

న్యూఢిల్లీ: డిజిటల్, టీవీ మాధ్యమాల ఊతంతో దేశీ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ ఈ ఏడాది 16 శాతం మేర వృద్ధి చెందనుంది. 11.1 బిలియన్‌ డాలర్లకు (రూ. 88,639 కోట్లు) చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌గా నిలవనుంది. గ్లోబల్‌ యాడ్‌ స్పెండ్‌ ఫోర్‌కాస్ట్స్‌ జులై 2022 నివేదికలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీ డెంట్సూ ఈ మేరకు అంచనాలు పొందుపర్చింది.

లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల సడలింపుతో ట్రావెల్, హాస్పిటాలిటీ(ఆతిథ్య) రంగాలు తిరిగి క్రమంగా కోలుకుంటున్నా యని, వాటి ప్రకటనలు కూడా పెరుగుతున్నాయని వివరించింది. అలాగే ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, గేమింగ్, క్రిప్టోకరెన్సీ వంటి వ్యాపారాల ప్రకటనలు కూడా ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో పెరుగుతున్నాయని పేర్కొంది.  

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
2021లో భారతీయ అడ్వరై్టజింగ్‌ మార్కెట్‌ 9.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2022లో ఇది 11.1 బిలియన్‌ డాలర్లు, 2023లో 12.8 బిలియన్‌ డాలర్లు, 2024లో 14.8 బిలియన్‌ డాలర్లకు
చేరనుంది. 
ప్రకటనల్లో డిజిటల్‌ వాటా 33.4 శాతం వాటా ఉండనుంది. టీవీ అడ్వరై్టజింగ్‌ వాటా 41.8 శాతం స్థాయిలో కొనసాగనుంది. కొత్త కంటెంట్, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వంటి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ఇందుకు ఊతమివ్వ నున్నాయి. టీవీ మాధ్యమంతో పోలిస్తే డిజిటల్‌ ప్రకటనల విభాగం రెండు రెట్లు పెరగనుంది. డిజిటల్‌ విభాగం 31.6 శాతం, టీవీ విభాగం 14.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. 
అంతర్జాతీయంగా అడ్వరై్టజింగ్‌ వ్యయాలు 8.7 శాతం పెరిగి 738.5 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. ఆసియా పసిఫిక్‌లో ఇవి 250 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇందులో చైనా మార్కెట్‌ 5.6 శాతం వృద్ధితో 130.2 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.  
329.6 బిలియన్‌ డాలర్లతో ప్రకటనలపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండనుంది. అమెరికాలో యాడ్‌ల మార్కెట్‌ 13.1 శాతం పెరగనుంది. బ్రెజిల్‌ 9 శాతం వృద్ధి చెందనుంది. 
ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రకటనల రంగంలో రికవరీ కొనసాగుతోంది. అయితే, కీలక మార్కెట్లలో లాక్‌డౌన్‌లు, భౌగోళికరాజకీయపరమైన ఉద్రిక్తతలు, సరఫరాపరమైన సమస్యలు మొదలైనవి వ్యాపారాలపైన, తత్ఫలితంగా మార్కెటింగ్‌ వ్యయాలపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దేశీ ‘యాడ్స్‌’ మార్కెట్‌ 16 శాతం అప్‌

మరిన్ని వార్తలు