త్వరలో ‘నైపుణ్యాల హబ్‌’గా భారత్‌

1 Mar, 2023 01:35 IST|Sakshi

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రజల్లో అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాలు, అవగాహనను పెంపొందించేందుకు విద్య, నైపుణ్యాల కల్పనపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయడం చాలా ముఖ్యమని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అప్పుడే వారు 21వ శతాబ్దంలో అవకాశాలను దక్కించుకోవడానికి సర్వసన్నద్ధులుగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న భారత్‌.. అతి త్వరలోనే ప్రపంచ నైపుణ్యాల హబ్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, స్విట్జర్లాండ్‌కి చెందిన హోటల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌టీఎంఐ) భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆతిథ్య రంగంలో విద్యార్థులు కెరియర్‌ను ఏర్పర్చుకోవడానికి, అంతర్జాతీయంగా నిపుణుల కొరతను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొన్నారు. దీనితో డ్యుయల్‌ డిగ్రీ విధానంలో విద్యాభ్యాసం చేస్తున్న వారికి కచ్చితమైన ఉద్యోగావకాశాలు లభించగలవని, పరిజ్ఞానం పెంపొందించుకోగలరని ప్రధాన్‌ వివరించారు. హెచ్‌టీఎంఐకి ఆస్ట్రేలియా, చైనా, దుబాయ్, మారిషస్‌ తదితర దేశాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. స్విస్‌–యూరోపియన్‌ కలినరీ ఆర్ట్స్‌ మొదలైన విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు అందిస్తోంది. 

మరిన్ని వార్తలు