అప్పటికి 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్

12 Oct, 2020 16:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలో మాంద్యంలోకి జారుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా అధ్యయనం కీలక విషయాన్ని ప్రచురించింది. 2050 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా తరువాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా అవతరిస్తుందని లాన్సెట్ పత్రిక ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా జపాన్‌ను వెనక్కు నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, ప్రపంచంలో  భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. తరువాత ఫ్రాన్స్, యూకే ఉన్నాయి. (ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే)

ప్రపంచంలోని దేశాలలో శ్రామిక జనాభా గురించి ఒక అధ్యయనం జరిగింది. 2017లో భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొంది. ఈ ప్రాతిపదికన 2030 నాటికి భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఈ అధ్యయనం తెలిపింది. 2030 నాటికి  చైనా, జపాన్ భారత్ కంటే ముందంజలో ఉంటాయని తెలిపింది. చైనా, భారతదేశంలో శ్రామిక జనాభా బాగా క్షీణించినట్లు లాన్సెట్ వెల్లడించింది ఈ సమయంలో, నైజీరియాలో శ్రామిక జనాభా పెరుగుతుందని తెలిపింది. అయినప్పటికీ, శ్రామిక జనాభా పరంగా భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. 2100 వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శ్రామిక జనాభాగా ఉంటుందని పేర్కొంది. 

మరోవైపు 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నీతీ ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇప్పటికే అంచనా వేశారు.  కోవిడ్-19 మహమ్మారి చాలా వ్యాపారాలను నష్టాల్లోకి నెట్టివేసింది. దీంతో ఈ సంవత్సరం, ఏప్రిల్-జూన్ కాల త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 

చదవండి: మూడోరోజూ భగ్గుమన్న బంగారం

మరిన్ని వార్తలు