2050 కల్లా రెండో పెద్ద ఎకానమీ

21 Nov, 2022 06:14 IST|Sakshi

అదానీ గ్రూప్‌ గౌతమ్‌ అదానీ ధీమా

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2050 కల్లా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు భారత్‌కి 58 ఏళ్లు పట్టగా, రెండో ట్రిలియన్‌కు చేరేందుకు 12 సంవత్సరాలు పట్టింది. మూడో దానికి చేరేందుకు అయిదేళ్లు మాత్రమే పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణల వేగం ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్ద కాలంలో దేశ జీడీపీ ప్రతి 12–18 నెలలకు 1 ట్రిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెందుతుంది.

తద్వారా 2050 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారగలదు. స్టాక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 45 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరవచ్చు‘ అని ఆయన చెప్పారు. 21వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా అదానీ ఈ విషయాలు తెలిపారు. భారత్‌ ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎకానమీ 23 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, స్టాక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 45–50 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది.  

సూపర్‌పవర్‌లపై తొలగిన అపోహలు..
ఇటీవలి సంక్షోభాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనేక అపోహలు తొలగిపోయాయని అదానీ చెప్పారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామిక సూత్రాలను చైనా పాటించక తప్పదు, ప్రపంచవ్యాప్తంగా సెక్యులరిజం సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి, యూరోపియన్‌ యూనియన్‌ ఎప్పటికీ కలిసే ఉంటుంది, అంతర్జాతీయంగా రష్యా పాత్ర తగ్గిపోతుంది వంటి అనేక అపోహలను ఇటీవలి సంక్షోభాలు తుడిచిపెట్టేశాయని అదానీ చెప్పారు. అలాగే ఏక ధృవ, ద్వి ధృవాల కాలంలో ప్రపంచానికి కష్టం వస్తే సూపర్‌ పవర్‌లు రంగంలోకి దిగి చక్కబెట్టేయగలవన్న అపోహలు కూడా పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

తొమ్మిది రోజులకో యూనికార్న్‌ ..
భారత్‌ సామర్థ్యాలను వివరిస్తూ .. 2021లో దేశీయంగా ప్రతి 9 రోజులకి ఒక స్టార్టప్‌ సంస్థ  యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌) హోదా దక్కించుకుందని అదానీ చెప్పారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ అన్నింటినీ కలిపినా ఆరు రెట్లు అధికంగా భారత్‌ రియల్‌ టైమ్‌లో 48 బిలియన్ల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు 50 బిలియన్‌ డాలర్లు దాటగలవని అదానీ తెలిపారు. 

మరిన్ని వార్తలు