80 బిలియన్‌ డాలర్లకు ‘బయో–ఎకానమీ’

10 Jun, 2022 04:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్‌ డాలర్ల నుంచి 80 బిలియన్‌ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. బయోటెక్‌ వ్యవస్థలో టాప్‌ 10 దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు.

బయోటెక్‌ స్టార్టప్‌ ఎక్స్‌పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు. కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్‌ స్టార్టప్స్‌ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్‌ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్‌పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్‌ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు