గూగుల్‌కి ఎదురుదెబ్బ.. రెండేళ్ల దర్యాప్తు ఓ కొలిక్కి! అక్రమాలను ధృవీకరించిన సీసీఐ

20 Sep, 2021 08:06 IST|Sakshi

టెక్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది.  ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు నిజమని తేలింది.  ఈ మేరకు రెండేళ్ల తర్వాత ఆరోపణల్ని నిర్ధారించుకున్న దర్యాప్తు ఏజెన్సీ..  గూగుల్‌పై తీసుకునే చర్యల విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.
  

యాప్‌ మార్కెటింగ్‌లోనూ గూగుల్‌కు భారత్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌. అలాంటిది అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసి లాభపడిందనే ఆరోపణలు గూగుల్‌పై వెల్లువెత్తాయి. ఒక్క గూగుల్‌ మాత్రమే కాదు.. అమెజాన్‌, యాపిల్‌ సహా అరడజను కంపెనీలను ఈ తరహా ఆరోపణలే చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తు చేపట్టింది.

చదవండి: కమిషన్‌ కక్కుర్తిపై యాపిల్‌ గప్‌చుప్‌

అక్రమాల ఆరోపణలివే..
తయారీ కంటే ముందే తమకు, తమతో ఒప్పందాల్ని కుదుర్చుకున్న కంపెనీల యాప్‌ల్ని ఇన్‌స్టాల్‌ చేయాలని డివైజ్‌ తయారీదారులను  ఒత్తిడి చేసిందనేది గూగుల్‌పై మోపబడిన ప్రధాన ఆరోపణ. యాప్‌ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం భారత చట్టాల ప్రకారం నేరం కూడా. ఈ మేరకు సదరు వేధింపులపై అలియన్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌(ADIF) ఫిర్యాదు చేయడంతో సీసీఐ 2019లో దర్యాప్తు మొదలుపెట్టింది. డివైజ్‌ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు,  ప్రత్యామ్నాయ వెర్షన్‌లను(ఫోర్క్స్‌) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. అధికారిక ప్రకటనతో పాటు, గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ.  మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి.

చర్చల దిశగా గూగుల్‌!
ఇక గూగుల్‌కి ఎదురుదెబ్బ నేపథ్యంలో  అలియన్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌(350 స్టార్టప్స్‌, ఫౌండర్స్‌, ఇన్వెస్టర్స్‌) హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు తాజాగా యాప్‌ మార్కెటింగ్‌ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం లాంటిదే.. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని ADIF  కోరుతోంది. అయితే ఈ ఆరోపణల్ని ఖండిస్తూనే.. సీసీఐతో చర్చలకు సిద్ధపడుతోంది గూగుల్‌. ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో పోటీతత్వం ఎలా ఉందనే విషయాన్ని, ఆవిష్కరణలకు తాము ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నామనే విషయాన్ని సీసీఐ బెంచ్‌ ఎదుట హాజరై వివరించబోతున్నట్లు గూగుల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఇదీ చదవండి: సౌత్‌ కొరియా చేసింది ఇదే.. మరి భారత్‌ సంగతి? 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు