57 శాతం తగ్గిన ఇండియా సిమెంట్స్‌ లాభం

11 Nov, 2021 06:14 IST|Sakshi

ముడిసరుకుల ధరల ప్రభావం

రూ.32.53 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 57 శాతం క్షీణించి రూ.32.53 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.69 కోట్లుగా ఉంది. రుతుపవనాలు ఎక్కువ కాలం పాటు కొనసాగడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలపై ప్రభావం చూపించాయి. ఆదాయం 13 శాతం పెరిగి రూ.1,235 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,090 కోట్లుగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఉత్పత్తి 8 శాతం పెరిగినట్టు కంపెనీ ప్రకటించింది.

‘‘కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే కీలక మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు వర్షాలు ఉండడం, వరదలు రావడం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా రెండో విడత ప్రభావం కొనసాగడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో సంతృప్తికరమైన పనితీరునే చూపించాం’’ అని ఇండియా సిమెంట్స్‌ పేర్కొంది. ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ఒత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్టు తెలిపింది. అయినప్పటికీ విక్రయాలు పెంచుకోవడం ద్వారా మంచి పనితీరునే చూపించినట్టు పేర్కొంది. వ్యయాలు 22 శాతానికి పైగా పెరిగి రూ.1,201 కోట్లుగా ఉన్నాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 6 శాతం వరకు నష్టపోయి రూ.210 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు