చైనాతో వాణిజ్యం కొత్త పుంతలు

15 Jan, 2022 03:41 IST|Sakshi

2021లో 125 బిలియన్‌ డాలర్లకు విస్తరణ

2020తో పోలిస్తే 43 శాతం అధికం

సరిహద్దు ఘర్షణల ప్రభావం పరిమితమే

బీజింగ్‌: భారత్‌–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో రికార్డు స్థాయిలో 125 బిలియన్‌ డాలర్లకు (రూ.9.37 లక్షల కోట్లు) విస్తరించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం వాణిజ్యంపై పడలేదని స్పష్టమవుతోంది.

చైనా నుంచి దిగుమతులు పెరిగిపోవడంతో ఆ దేశంతో భారత్‌ వాణిజ్య లోటు 69 బిలియన్‌ డాలర్లకు (బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.7,500కోట్లు) విస్తరించింది. 2021లో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 46 శాతం పెరిగి 97.52 బిలియన్‌ డాలర్లకు విస్తరించగా.. భారత్‌ నుంచి చైనాకు ఎగుమతులు 34 శాతం వృద్ధితో 28.14 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు కస్టమ్స్‌ విభాగం డేటా ఆధారంగా గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొంది.  

భారత్‌ ఆందోళన..
గత దశాబ్దకాలంగా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతుండడం పట్ల భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత ఐటీ, ఫార్మా ఉత్పత్తులకు ద్వారాలు తెరవాలని చైనాను గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. అయినా బీజింగ్‌ పట్టించుకోవడం లేదు. కరోనా రెండో విడత ప్రభావంతో వైద్య పరికరాల దిగుమతి, ఫార్మా కంపెనీలు ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడమే ఆ దేశం నుంచి భారత్‌కు ఎగుమతులు భారీగా పెరిగేందుకు కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

2021 మే5 న ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. పదుల సంఖ్యలో సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు చైనా నుంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) తీసుకొచ్చింది. ఇప్పటికే 13–14 రంగాలకు దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా ఉత్పత్తుల తయారీని స్థానికంగానే పెంచుకుని, ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది కేంద్ర సర్కారు ప్రణాళిక. ఇది ఆచరణ రూపం దాలిస్తే చైనాపై ఆధారపడడం
తగ్గుతుంది.   

మరిన్ని వార్తలు